అన్నాడీఎంకేతో కలిసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది: కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు

  • విజయ్ సీఎంగా కాకుండా ద్రవిడ పార్టీలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం
  • బీజేపీకి ఇప్పటికే అన్నాడీఎంకే లొంగిపోయిందన్న మాణిక్కం ఠాకూర్
  • డీఎంకేను కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందని విమర్శ
విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఉండేందుకు, డీఎంకే పార్టీ అన్నాడీఎంకేతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌కి అధికారం దక్కకుండా ఉండేందుకు బీజేపీ, అమిత్ షా తమిళనాడులో కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

తమిళనాడులో ప్రధాన ద్రవిడ పార్టీలపై బీజేపీ తన ఆధిపత్యాన్ని చూపించడం ప్రారంభించిందని అన్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే బీజేపీకి లొంగిపోయిందని, ఇప్పుడు డీఎంకేను కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలని కమలం పార్టీ చూస్తోందని ఆరోపించారు. తమిళనాడులో బీజేపీకి కనీస బలం కూడా లేదని విమర్శించారు. కానీ ద్రవిడ పార్టీల ద్వారా రాష్ట్రాన్ని నియంత్రించాలని చూస్తోందని అన్నారు.

తమిళనాడులో బీజేపీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారని గుర్తు చేశారు. కానీ విజయ్‌ ముఖ్యమంత్రి కాకుండా అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌తో బీజేపీ నాటకం ఆడిస్తోందని అన్నారు. బీజేపీ చెప్పినట్లే గవర్నర్ వింటున్నారని మండిపడ్డారు.

బీజేపీని తమిళ ప్రజలు అస్సలు క్షమించరని అన్నారు. అధికారం కోసం అన్నాడీఎంకేతో జతకట్టేందుకు డీఎంకే సిద్ధమవుతోందని ఆరోపించారు. కానీ ఎన్నికల తర్వాత తామేదో వెన్నుపోటు పొడిచినట్లు డీఎంకే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తమిళనాడుపై బీజేపీ ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలని సూచించారు.

Manickam Tagore
Tamil Nadu politics
DMK AIADMK alliance
Vijay actor
Amit Shah
BJP Tamil Nadu

More Telugu News